తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోన్న నయనతార, సెకండ్ ఇన్నింగ్స్లో పలు లేడీ ఓరియంటడ్ సినిమాలతోనూ మెప్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నయనతార హీరోయిన్గా తమిళంలో ‘మాయ’ పేరుతో ఓ హర్రర్ డ్రామా రూపొందింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ చేశారు. మంచి అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా శుక్రవారం పెద్ద ఎత్తున విడుదలైంది.
ఇక విడుదలైన మొదటి షో నుంచే ఈ సినిమా అన్నిచోట్లా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చాలాకాలం తర్వాత పూర్తి హర్రర్ డ్రామా రావడంతో హర్రర్ జానర్ అభిమానులు కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలోనే మొదటి వీకెండ్ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ బాగున్నాయి. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తమిళంలో ‘మాయ’ పేరుతో విడుదలైన ఈ సినిమా అక్కడా సూపర్ కలెక్షన్స్ కొల్లగొడుతోంది.


