యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్‌తో సంచలనం సృష్టించిన నటి చాందిని చౌదరి, తాజాగా వెండితెరపై కూడా మెరిసి ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ‘కేటుగాడు’ సినిమాతో వెండితెరకు పరిచయమై మెప్పించిన ఈ భామ, త్వరలోనే మహేష్ బాబు సరసన కనిపించనుంది. మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చాందినీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్లో మహేష్‌తో పాటు చాందినీ నటిస్తున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఓ అందమైన కుటుంబ కథా చిత్రం తర్వాత మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో బ్రహ్మోత్సవంపై ఇప్పట్నుంచే మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే సమంత, కాజల్, ప్రణీత ఇలా ముగ్గురు హీరోయిన్లు ఉండగా, తాజాగా చాందినీ ఓ స్పెషల్ రోల్ చేయనుండడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. సమ్మర్ కానుకగా బ్రహ్మోత్సవం సినిమా విడుదల కానుంది.


