యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ అనుబంధం కారణంగానే సైరా కోసం ప్రభాస్ ప్రమోషన్స్ చేయబోతున్నాడు. తనదైన రీతిలో సైరా కోసం ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి ప్రభాస్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాడట. అందులో భాగంగానే ప్రభాస్, చరణ్ మరియు చిరంజీవిలతో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూను అతి త్వరలో షూట్ చేయనున్నారు. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ బాలీవుడ్ లో సైరాకి ఉన్న క్రేజ్ ను ఖచ్చితంగా తదుపరి స్థాయికి తీసుకువెళ్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది.
కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.


