చిత్ర పరిశ్రమలో హీరో విక్రమ్ ది విలక్షణ శైలి, గొప్పనటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆయన ప్రయోగాలు చేయడంలో దిట్ట. సినిమా కోసం శరీర ఆకృతిని కూడా పాత్ర తగ్గట్టు మార్చుకొనే కొద్దిమంది నటులలో చియాన్ విక్రమ్ ఒకరు. ఆయన ఇటీవల నటించిన మిస్టర్ కె కె ప్రేక్షకులను నిరాశపరిచింది. తమిళంతో సమానంగా తెలుగులో కూడా మార్కెట్ ఉన్న విక్రమ్ తన స్థాయి విజయాన్ని నమోదు చేసి చాలా కాలం అవుతుంది.
కాగా విక్రమ్ తన 58వ చిత్ర షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. మరో మారు భారీ ప్రయోగానికి తెరదీసిన విక్రమ్ ఈ చిత్రంలో ఏకంగా 25గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 4నుండి మొదలుకానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, వియాకామ్ 18స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుందని సమాచారం.


