తమిళ హీరో విశాల్ కెరీర్లోని హిట్ చిత్రాల్లో ‘తుప్పరివాలన్’ కూడా ఒకటి. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళనాట బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో విడుదలై మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్న విశాల్ ఇప్పుడు ఆ పనిని స్టార్ట్ చేశారు.
ఈరోజు నుండి లండన్ లో ఈ సీక్వెల్ షూట్ మొదలవుతుందట. సుమారు 40 రోజుల పాటు షూటింగ్ అక్కడే జరుగుతుందట. ఇందులో ఆశయ అనే కొత్త హీరోయిన్ నటిస్తోంది. మాస్ట్రో ఇళయరాజ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో కూడా విశాల్ డిటెక్టివ్ పాత్రలోనే కనిపించనున్నారు. మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ స్వయంగా నిర్మిస్తున్నారు.


