నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొడలుకానుంది. కాగా తాజా సమాచారం ప్రకారం తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నారు. మెయిన్ గా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు తెలుస్తోంది. తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోందట.
ఇక షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో అమితాశక్తి నెలకొని ఉంది. ఇక తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో భాగస్వామం తీసుకున్నారు.


