ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఎంత మంచివాడవురా”. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హాల్ నందు అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అభిమానుల సోదలందరికీ అలాగే చిత్రబృందానికీ నా ధన్యవాదాలు. నాకు ఎప్పటినుంచో కళ్యాణ్ అన్నయ్య ఒక ఫ్యూర్ ఫ్యామిలీ మూవీ చేస్తే చూడాలనే కోరిక ఉండేది. అది ఈ రోజు సతీష్ గారి డైరెక్షన్ లో నెరవేరుతున్నందుకు చాల సంతోషంగా ఉంది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి సినిమాల్ని ఆదరించే గొప్ప గుణం మన తెలుగు ప్రేక్షుక దేవుళ్ళకు ఉంది. ఈ సినిమాని మీ గొప్ప హృదయంతో మీ గొప్ప మనసుతో ఆదరిస్తారని ఆదరించాలని కోరుకుంటున్నాను. ముగించే ముందు .. మీరందరికీ ఒక విజ్ఞప్తి. మీరంతా చాల ఆనందంలో ఉన్నారు. ఇదే ఆనందాన్ని మీ ఇంటవరకూ వెళ్లి పంచుకోండి. దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి, మీరంతా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. మీరందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ‘ఎంత మంచివాడవురా’తో పాటు ఈ సంక్రాంతికి వస్తోన్న మిగిలిన సినిమాలు దర్బార్, సరిలేరు నీకెవ్వరు, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధించి.. తెలుగు చిత్రసీమ మరింత ముందుకు వెళ్లాలని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. జై ఎన్టీఆర్ జై హరికృష్ణ’ అని ఎన్టీఆర్ తన ప్రసంగం ముగించారు.
ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని ఆశిద్దాం.


