
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎవరినైనా విమర్శించడం మొదలుపెట్టారు అంటే ఎంతవరకైనా వెళ్తారు. మాటకు మాట సమాధానం ఇవ్వడమే తప్ప వెనక్కు తగ్గరు. అలా ఈ మధ్య కాలంలో కంగనా విమర్శల బారినపడిన నటీనటులు, రాజకీయ నాయకులు చాలామందే ఉన్నారు. అయితే నిత్యం విమర్శలు చేసే ఆమె తాజాగా ఒక దర్శకుడి మీద పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన మరెవరో కాదు తమిళ దర్శకుడు విజయ్. పొగడటం అంటే అలా ఇలా కాదు ఏకంగా దేవుడు అనేసింది.
కంగనా విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తలైవి’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దివంగత జయలలిత బయోపిక్. జయ పాత్రను కంగనా చేస్తోంది. సినిమా విషయంలో చాలా సంతృప్తిగా ఉన్న ఆమె ‘ఇప్పటికి సగం డబ్బింగ్ పూర్తైంది. ఇంకో సగం మాత్రమే మిగిలి ఉంది అన్న కంగనా విజయ్.. మీరు వైన్, మాంసాహారం, టీ, కాఫీ, పార్టీలకు అస్సలు దగ్గర అవ్వరు. మీరొక అద్భుతమైన వ్యక్తి అని త్వరగానే నాకు అర్థమైంది. సెట్లో ఒక్కరోజు కూడ నాకు తక్కువ అనే భావనే రాలేదు. మీలో కొంచెమైనా కోపం, అభద్రతా భావం నేను చూడలేదు. మీరు మనిషి కాదు దేవుడు. మనస్ఫూర్తిగా చెబుతున్నాను మిమ్మల్ని మిస్సవుతాను’ అంటూ పెద్ద పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

