
తమిళ హీరోలు విశాల్, ఆర్యలు కలిసి ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఆర్య, విశాల్ కలిసి బాల దర్శకత్వంలో చేసిన ‘అవన్ ఇవన్’ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఈ సినిమా మీద అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. విశాల్, ఆర్య ఇద్దరూ హెవీ యాక్షన్ సీన్స్ చేయనున్నారు. ముఖ్యంగా విశాల్ పాత్రకు ఎక్కువ యాక్షన్ స్కోప్ ఉండనుంది సినిమాలో.
విశాల్ అంటేనే భారీ ఫైట్లకు, యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. స్టంట్ కొరియోగ్రఫర్ ఎంతటి రిస్కీ స్టంట్ పెట్టినా అవలీలగా చేసేస్తారు విశాల్. ఈ సినిమాలో కూడ అలాంటి సన్నివేశమే ఒకటి ఉందట. అందులో విశాల్ 50 అడుగుల ఎత్తు నుండి నేల మీదకి దూకాల్సి ఉంది. ఈ షాట్ కోసం మామూలుగా అయితే రోప్స్, బెడ్స్ అంటూ సేఫ్టీ మెజర్స్ చాలానే ఉంటాయి. కానీ విశాల్ మాత్రం రోప్స్ లేకుండానే 50 అడుగులు ఎత్తు నుండి కిందికి దూకేసి స్టంట్ చేశారట. ఆయన సాహసానికి సెట్ మొత్తం షాకయ్యారట. మరి విశాల్ అంటే ఆమాత్రం ఉంటుంది కదా. ఇకపోతే ఈ చిత్రానికి ‘ఎనిమీ’ అనే టైటిల్ నిర్ణయించారు.

