కరోనా లాక్ డౌన్ కారణంగా భారీగా దెబ్బతిన్న తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చింది. సినిమా థియేటర్లకు సంబంధించిన విద్యుత్ ఛార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన విద్యుత్ ఫిక్స్‌డ్ ఛార్జీలకు మినహాయింపు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్స్‌డ్ ఛార్జీలను డిసెంబర్ నెలలోపు ఎప్పుడైనా చెల్లించే వెసులుబాటును కల్పించింది.
గత ఏడాదిలో కూడ ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్ విద్యుత్ ఛార్జీలు రద్దు చేస్తూ, మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్ యజమానులకు మరికొంత ఊరట లభించినట్టయ్యింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆదుకున్నారని, ముఖ్యమంత్రి జగన్ సహకారంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.


