సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌లపై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన హారర్ థ్రిల్లర్ ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు వీరభద్రం చౌదరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
భూతనాల చెరువు నేపథ్యం, కాలేజీలో దాగి ఉన్న మిస్టరీ చుట్టూ ఈ కథ నడుస్తుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. నలుగురు యువకులు ఓ భవనంలో చిక్కుకోవడం, అక్కడి నుంచి బయటకు రాలేకపోవడం, జిన్ ఎంట్రీ వంటి అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, భయపెట్టేలా సాగింది. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత ఇందులో కీలక పాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. “ప్రేక్షకులను సరిగ్గా భయపెట్టగలిగితే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. సినిమాకు భాషా సరిహద్దులు ఉండవు, కేవలం మంచి సినిమానా కాదా అనేదే ముఖ్యం. ‘జిన్’ పెద్ద విజయం సాధించాలి” అని ఆకాంక్షించారు. హీరో సోహెల్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని, ‘స్పూకీ వరల్డ్’ అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుందని తెలిపారు. ముస్లిం మతంలో దెయ్యాలను ‘జిన్’ అంటారని, ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


