శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం “ఓ టార్చర్ ప్రేమ”. విప్లవ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దివంగత మాదాల రంగారావు మనవడు, నటుడు మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. మౌనిక డాకోజు ఇందులో కథానాయిక. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. “తాత, తండ్రి విప్లవ మార్గంలో ప్రయాణిస్తే, మూడో తరం హీరో సన్నీ మాత్రం ప్రేమ మార్గాన్ని ఎంచుకున్నాడు” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకనిర్మాత శ్రీకర్ కృష్ణ బాధ్యతలను చూస్తుంటే దాసరి నారాయణరావు గుర్తుకొస్తున్నారని ప్రశంసించారు.
వినోదంతో కూడిన ఈ ప్రేమకథ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని దర్శకుడు శ్రీకర్ కృష్ణ తెలిపారు. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



