ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ప్రధాన పాత్రలో, రతన్ రిషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం “క్వీన్”. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘వన్ సర్కిల్ ఫిలిమ్స్’ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంతో యామినీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.
సమాజంతో ముడిపడిన ఒక విభిన్నమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది. “రాళ్లమీద, తాజ్ మహల్ మీద మిగిలిపోయే ప్రేమకథలు కాదు.. దేశ గమనాన్ని మార్చే శాసనంగా నిలిచే ప్రేమకథ” అనే నేపథ్యం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత రాజ్యాంగం, ఆర్టీఐ యాక్ట్ వంటి అంశాలను ఇందులో ప్రస్తావించారు. తాను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ, దానికి చట్టబద్ధమైన గుర్తింపు తెచ్చేందుకు ఓ యువతి చేసే పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం.
‘ఉత్తర’, ‘ఆర్టిస్ట్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రతన్ రిషికి ఇది మూడో సినిమా. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్ తండ్రిగా ఒక కీలక పాత్ర కోసం 90ల నాటి ప్రముఖ హీరోను చిత్ర బృందం సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


