తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరో క్రేజీ మూవీకి సైన్ చేసింది. ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్ (Ess Kay Gee Entertainment), బెంచ్‌మార్క్ స్టోరీ టెల్లర్స్ (Benchmark Storytellers) సంస్థలు సంయుక్తంగా అనుపమ మెయిన్ లీడ్‌గా ఒక కొత్త సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాయి.
ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఒక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కి ఆర్జే షాన్ (RJ Shaan) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒక ప్రముఖ స్టూడియోతో కలిసి శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది మే నెలలో స్టార్ట్ కానుంది. అలాగే సినిమా టైటిల్ ఏంటి అనేది కూడా చిత్ర యూనిట్ త్వరలోనే రివీల్ చేయనుంది.
ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. డైరెక్టర్ ఆర్జే షాన్ మరియు అనుపమ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ సక్సెస్ ఇచ్చిన నమ్మకంతోనే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈ జోడీ వస్తోంది.
రెండవది.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా సౌత్ మార్కెట్ మీద ఫోకస్ చేయడం. గతంలో ‘రుస్తుం’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’, ‘పరి’ వంటి కంటెంట్ బేస్డ్ హిట్ సినిమాలను నిర్మించిన ఆమె.. సౌత్‌లో అనుపమ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.


