సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’. ‘RRR’ వంటి అంతర్జాతీయ విజయం తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర మరియు శ్రీరాముడు అనే రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. తాజాగా గుంటూరులోని మైత్రి సినిమాస్ వద్ద మహేష్ బాబు రాముడి గెటప్‌లో ఉన్న డిజిటల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ధనుస్సు పట్టుకుని గంభీరంగా ఉన్న మహేష్ లుక్ చూసి రాజమౌళి సైతం తనకు ‘గూస్‌బంప్స్’ వచ్చాయని ప్రశంసించడం విశేషం.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.



