కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న తాజా చిత్రం “తిమ్మరాజుపల్లి టీవీ”. కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వి.మునిరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ, సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పీరియాడిక్ విలేజ్ డ్రామా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ‘గ్రాండ్ రివీల్ ఈవెంట్’ను ఘనంగా నిర్వహించింది.
1995 నాటి గ్రామీణ నేపథ్యంలో ఓ సస్పెన్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. శివరాత్రి పండుగ సందర్భంగా ఊరికి అద్దెకు తీసుకొచ్చిన ఒక టీవీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పటి పల్లెటూరి వాతావరణం, మనుషుల అమాయకత్వం, టీవీకి ఉన్న ప్రాధాన్యతను దర్శకుడు మునిరాజు ఈ సినిమాలో చాలా సహజంగా చూపించారని చిత్రబృందం పేర్కొంది.
ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. పరిశ్రమలో స్థిరపడిన తర్వాత వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. తన సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయి తేజ్‌ను హీరోగా, ఆన్లైన్ ఎడిటర్‌గా చేసిన మునిరాజును దర్శకుడిగా పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అద్భుతంగా పనిచేశారని, వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదని ఆయన స్పష్టం చేశారు.


