ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలయికలో రూపొందనున్న భారీ యాక్షన్ డ్రామాపై తాజాగా ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చాయి. ‘వారిసు’ వంటి సక్సెస్ తర్వాత వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్టులో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన ఈ సినిమాలో నెగటివ్ రోల్‌లో కాకుండా, ఒక పాజిటివ్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్టులో విలన్ పాత్ర కోసం ఒక టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. అందులో భాగంగా అనిల్ కపూర్‌ను ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ కోసం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ కపూర్ కనుక ఈ ప్రాజెక్టులోకి వస్తే, సినిమా స్థాయి మరింత పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కుల్దీప్ రాథోడ్, రఫీ కాజీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2026 నుండి ప్రారంభం కానుంది.


