మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ జూన్ 4న విడుదలకు సిద్ధమవడంతో ఇతర చిత్రాలకు గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా జూన్ 5న విడుదల కావాల్సిన సత్యదేవ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ ఇప్పుడు చిక్కుల్లో పడింది. వెంకటేష్ మహా దర్శకత్వంలో మహేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిన్న చిత్రం, చరణ్ సినిమా ధాటికి థియేటర్లు దొరకక ఇబ్బంది పడే అవకాశం ఉంది.
నిజానికి ‘రావు బహదూర్’ కంటెంట్ పరంగా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నప్పటికీ, ‘పెద్ది’ వంటి భారీ మాస్ సినిమా ముందు నిలబడటం సాహసమనే చెప్పాలి. ‘పెద్ది’ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా మెజారిటీ థియేటర్లు, షోలు ఆ సినిమాకే కేటాయిస్తారు. దీనివల్ల మహేష్ బాబు బ్రాండ్ ఉన్నా సరే, సత్యదేవ్ చిత్రానికి కనీస స్థాయిలో స్క్రీన్లు లభించడం కష్టంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ‘రావు బహదూర్’ టీమ్ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, రిస్క్ తీసుకుని చరణ్ సినిమాతో పోటీ పడటం.. లేదా క్లాష్‌ను నివారించి మరో మంచి డేట్‌ను వెతుక్కోవడం. కంటెంట్ మీద ఆధారపడే సినిమాలు ఇలాంటి భారీ స్టార్ చిత్రాల మధ్యలో రావడం కంటే, సోలోగా వచ్చి మౌత్ టాక్‌తో పుంజుకోవడమే మంచిదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.


