IPL 2026: రూ.1.72 లక్షల కోట్లకు పైగా ఐపీఎల్ విలువ.. $300 మిలియన్లు దాటిన తొలి జట్టుగా ఆర్‌సీబీ.. ఎస్‌ఆర్‌హెచ్ స్థానం ఎంతంటే?

IPL 2026: రూ.1.72 లక్షల కోట్లకు పైగా ఐపీఎల్ విలువ.. $300 మిలియన్లు దాటిన తొలి జట్టుగా ఆర్‌సీబీ.. ఎస్‌ఆర్‌హెచ్ స్థానం ఎంతంటే?

Published on Jul 29, 2026 6:49 PM IST

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘హూలిహన్ లోకీ’ (Houlihan Lokey) విడుదల చేసిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ 2026 నివేదిక ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంటర్‌ప్రైజ్ విలువ సరికొత్త ఎత్తుకు చేరింది. లీగ్ విలువ తొలిసారిగా 20 బిలియన్ డాలర్ల మార్కును దాటి 20.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.72 లక్షల కోట్లు) పెరిగింది. గతేడాయితో పోలిస్తే లీగ్ బిజినెస్ విలువలో 11 శాతం వృద్ధి నమోదైంది. అలాగే ఐపీఎల్ స్టాండ్‌అలోన్ బ్రాండ్ విలువ 10 శాతం పెరిగి 4.3 బిలియన్ డాలర్లకు చేరింది.

తొలి స్థానంలో ఆర్‌సీబీ

ఈ నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ అత్యంత విలువైన జట్టుగా వరుసగా రెండో ఏడాదీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆర్‌సీబీ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగి 312 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.2,600 కోట్లు) చేరింది. ఐపీఎల్ చరిత్రలోనే 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యుయేషన్ దాటిన మొదటి టీమ్‌గా ఆర్‌సీబీ నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 264 మిలియన్ డాలర్ల విలువతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

మిగిలిన ఫ్రాంచైజీల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ($245 మిలియన్లు) మూడో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ ($244 మిలియన్లు) నాలుగో స్థానంలో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ 168 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్ ($161M), పంజాబ్ కింగ్స్ ($158M), గుజరాత్ టైటాన్స్ ($157M), ఢిల్లీ క్యాపిటల్స్ ($156M), లక్నో సూపర్ జెయింట్స్ ($122M) ఉన్నాయి.

పెరిగిన డిజిటల్ వీక్షకులు

డిజిటల్ వీక్షకుల సంఖ్య పెరగడం, కొత్త పెట్టుబడులు ఐపీఎల్ మార్కెట్ విలువ వృద్ధికి ప్రధాన కారణాలని విశ్లేషకులు తెలిపారు. జియోస్టార్ (JioStar) డేటా ప్రకారం 2026 ఐపీఎల్ సీజన్ ఏకంగా 106 కోట్ల స్క్రీన్లకు చేరింది. కనెక్టెడ్ టీవీ (CTV) వీక్షకుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 26 శాతం పెరిగింది. అలాగే టోర్నీ మొత్తం రాబడి 1.8 బిలియన్ డాలర్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా మ్యాచ్‌ ఆధారిత ఆదాయంలో ఎన్‌ఎఫ్‌ఎల్‌ (NFL) తర్వాత ఐపీఎల్ రెండో స్థానంలో నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు