మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘ఇరుముడి’. గ్లింప్స్, ట్రైలర్, పాటలతో భారీ అంచనాలు పెంచిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో విశేషాలు పంచుకున్నారు.
ఇరుముడి సినిమాకి మ్యూజిక్ చేయడం మీకు ఎంత ప్రత్యేకంగా అనిపించింది?
నేను ఇప్పటివరకు ప్రేమ కథలు, కమర్షియల్ చిత్రాలు చేసినప్పటికీ ‘ఇరుముడి’ మాత్రం మైండ్ బ్లోయింగ్ మలుపులతో సాగే ఒక ఇంటెన్స్ థ్రిల్లర్. తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉండే ఈ చిత్రానికి రీ-రికార్డింగ్ ఇచ్చేందుకు మంచి స్కోప్ లభించింది. ఈ సినిమాకి ఉత్తమ రీజినల్ ఫిల్మ్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ లాంటి జాతీయ అవార్డులు రావడం ఖాయం. అలాగే ఈ చిత్రం కమర్షియల్‌గానూ విపరీతమైన సక్సెస్ సాధిస్తుందని అనుకుంటున్నా.
రవితేజ గారి నుంచి మీరు అందుకున్న అప్రిషియేషన్ ఏంటి?
ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అవ్వడంపై రవితేజ గారు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంకా విడుదల చేయని క్లైమాక్స్ పాట ఆయనకు బాగా నచ్చింది. ఎంతో ఎమోషనల్‌గా ఉండే ఆ పాట కథకు చాలా కీలకం. ప్రేక్షకులు ఆ ప్రత్యేకమైన పాటను నేరుగా థియేటర్లలోనే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు.
‘మల్లెపూల పల్లకి’ పాటను మళ్లీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు?
భక్తి నేపథ్యంతో ప్యూర్ డివోషనల్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి పాట ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది. ఐకానిక్ భక్తి గీతమైన ‘మల్లెపూల పల్లకి’ ఒరిజినల్ ఫీల్ పోకుండా ఉండేందుకు, దానిని ఒరిజినల్ సింగర్ మరియు బృందంతోనే పాడించాం. గత నాలుగు రోజులుగా ఈ పాట ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉండటం సంతోషంగా ఉంది.
ఈ సినిమాలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సీక్వెన్సులు ఏమిటి?
భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ వంటి భిన్నమైన ఎమోషన్స్ ఉన్న ‘ఇరుముడి’ చిత్రానికి సంగీతం అందించడం ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది. కేవలం రెండు, మూడు లేయర్స్‌లోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తూ, కథలోని ప్రతీ భావోద్వేగాన్ని మ్యూజికల్‌గా బ్యాలెన్స్ చేసేలా ఇంపాక్ట్‌ఫుల్ సైకలాజికల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాను.
ఈ సినిమాలో మీ ఫేవరెట్ సాంగ్ ఏమిటి?
నాకు ‘యాలాలో’ పాట చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ‘ఇరుముడి’కి ఆత్మ లాంటి పాట. అలాగే ఇందులో పాటలన్నీ కూడా ఆడియన్స్ చాలా అద్భుతంగా ఆదరించారు. మొత్తం ఐదు పాటలు ఉంటాయి. అవన్నీ కూడా కథలో భాగమైన పాటలు.
శివ నిర్వాణ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
దర్శకుడు శివ నిర్వాణ గారికి అద్భుతమైన మ్యూజిక్ టేస్ట్, లిరిక్ నాలెడ్జ్ ఉన్నాయి. ఆయన గత చిత్రాలకు భిన్నంగా ‘ఇరుముడి’ చాలా సీరియస్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్ తమ నటనతో మెప్పించారు. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ గారి సినిమాల్లో నాకు అత్యంత ఇష్టమైన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది. ఇది తెలుగు సినిమాలో ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది.
ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి?
ప్రస్తుతం అనిల్ రావిపూడి ప్రాజెక్ట్, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’, ‘శ్రీ శ్రీ’ చిత్రాలతో పాటు తమిళంలో పా. రంజిత్ దర్శకత్వంలోనూ సినిమాలు చేస్తున్నాను. అలాగే నటుడిగా ‘Immortal’ చిత్రం సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఇకపై నటుడిగా తెలుగులోనూ మంచి కథలు వస్తే తప్పకుండా నటిస్తాను.


