సూర్య కథానాయకుడిగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన కుటుంబ కథా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో పంచుకున్నారు.
ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై మీ అనుభూతి?
మేము ఆశించిన దానికంటే ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన లభిస్తోంది. సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
కథ విన్నప్పుడు సూర్య గారి స్పందన ఏమిటి?
సూర్య గారికి కథ మొదటిసారే బాగా నచ్చింది. ఆయన కూడా ఒక మంచి కుటుంబ కథా చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఈ కథ వినిపించాను. కథ విన్నాక.. బలవంతపు కమర్షియల్ అంశాలు, అనవసరపు కామెడీ లేకుండా సహజత్వంతో తెరకెక్కిద్దామని సూచించారు. అందుకే క్లైమాక్స్‌తో పాటు ప్రతి పాత్రను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాం. విడుదలకు ముందే సినిమా చూసిన ఆయన, కథ విన్నప్పుడు ఏం నమ్మారో తెరపై అదే చూశానని సంతృప్తి వ్యక్తం చేశారు.
మీ రచనలో త్రివిక్రమ్ గారి శైలి కనిపిస్తోందన్న ప్రశంసలపై ఏమంటారు?
నన్ను సినీ పరిశ్రమ వైపు నడిపించింది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారే. అలాంటిది ఆయనతో నన్ను పోల్చడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. త్రివిక్రమ్ గారి రచనలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ నాకిష్టమైన చిత్రం. సంభాషణల ద్వారానే జీవిత సత్యాలు చెప్పే ఆ తరహా రచన నాపై బలమైన ప్రభావం చూపింది.
ఈ కథా ఆలోచన ఎలా మొదలైంది?
వయసు వ్యత్యాసం ఉన్న ఒక బంధం నేపథ్యంలో కథ రాయాలని భావించాను. 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉండాలనే అంశంతో 2022లోనే కథ సిద్ధం చేసుకున్నాను. మనుషులు చెడ్డవారు కాదు, పరిస్థితులే వారిని అలా మారుస్తాయి అనే ఆలోచనను ప్రధానంగా తీసుకున్నాం. సూర్య గారు ప్రాజెక్ట్‌లోకి వచ్చాక ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లు కొన్ని మార్పులు చేశాం.
సినిమా చూశాక త్రివిక్రమ్ గారి స్పందన ఏమిటి?
సాధారణంగా సితార బ్యానర్ సినిమాలను చూశాక త్రివిక్రమ్ గారు కొన్ని మార్పులు సూచిస్తుంటారు. కానీ ‘విశ్వనాథ్ & సన్స్’ చూశాక ఎలాంటి మార్పులు చెప్పకుండా, సినిమా చాలా బాగుందని మనస్ఫూర్తిగా ప్రశంసించారు.
కథానాయికగా మమితా బైజు ఎంపిక వెనుక ఆలోచన?
‘ప్రేమలు’ సినిమా చూశాక ఈ పాత్రకు మమిత సరిగ్గా సరిపోతుందనిపించింది. ఆమెకు తమిళ భాషపై మంచి పట్టు ఉంది. వినోదాత్మక సన్నివేశాల్లో సరైన టైమింగ్ రావాలంటే భాషపై అవగాహన ఉండాలి. తన నటనతో ఆమె ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.


