మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ఆయన తాజా చిత్రం ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో చిరంజీవి సరికొత్త యాటిట్యూడ్, ఇంటెన్స్ స్వాగ్తో కూడిన సిల్హౌట్ లుక్‌లో కనిపిస్తున్నారు. “A New Avatar. A New Attitude. A Whole New Side Of Megastar” అంటూ సరికొత్త మేనరిజమ్‌తో చిరంజీవిని మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ‘బ్లడీ బెంచ్‌మార్క్’ ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సినిమా నేపథ్యం, చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో టైటిల్ గ్లింప్స్‌లో చూపించనున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. దాదాపు సగం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన చిత్రీకరణతో పాటు ఎడిటింగ్ వర్క్ కూడా లాక్ చేశారు. మలయాళ నటి అనస్వర రాజన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
టాప్ టెక్నికల్ టీమ్‌తో వస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, భాను-నందు సంభాషణలు సమకూరుస్తున్నారు.


