సమీక్ష: బెత్లెహెం కుటుంబ యూనిట్ – హాయిగా నవ్వించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

సమీక్ష: బెత్లెహెం కుటుంబ యూనిట్ – హాయిగా నవ్వించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

Published on Sep 4, 2026 12:03 AM IST

విడుదల తేదీ : సెప్టెంబర్ 04 , 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : నివిన్ పౌలీ, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్ తదితరులు
దర్శకత్వం : గిరీష్ ఏడీ
నిర్మాతలు : దిలీష్ పోతన్, ఫహద్ ఫాసిల్, శ్యామ్ పుష్కరన్
సంగీతం : విష్ణు విజయ్
ఛాయాగ్రహణం : అజ్మల్ సాబు
కూర్పు : ఆకాష్ జోసెఫ్ వర్గీస్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

మలయాళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ:

జస్టిన్ (నివిన్ పౌలీ) మధ్యవయస్కుడు. ఒక క్యాటరింగ్ సర్వీస్ నడుపుతూ తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. ఒక బలమైన కారణం వల్ల ఆయనకు పెళ్లి కాదు. ఈ క్రమంలో ఆయన ఇంటి పక్కనే ఓ కుటుంబం అద్దెకు దిగుతుంది. ఆ కుటుంబంలోని కాలేజ్ స్టూడెంట్ యాష్లే (మమితా బైజు)తో జస్టిన్‌కు క్రమంగా పరిచయం ఏర్పడి స్నేహంగా మారుతుంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో, యాష్లే తన ప్రేమను జస్టిన్‌కు వ్యక్తం చేస్తుంది. మొదట్లో నిరాకరించినా, చివరకు ఆమె ప్రేమను జస్టిన్ అంగీకరిస్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ తమ కుటుంబాలను ఒప్పించి పెళ్లి పీటలు ఎలా ఎక్కారన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అత్యుత్తమ రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. వినోదం విషయంలో ఈ సినిమా ‘ప్రేమలు’ స్థాయిని గుర్తుచేస్తూ చివరివరకు ఆకట్టుకుంటుంది.

థియేటర్లలో నవ్వులు పూయించే సన్నివేశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. సందర్భానుసారంగా వచ్చే సిట్యుయేషనల్ కామెడీ బాగా పేలింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే వినోదాత్మక సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఎక్కడా హద్దులు దాటకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించినందుకు దర్శకుడు గిరీష్ ఏడీకి మంచి మార్కులు పడతాయి. తెలుగు డబ్బింగ్ సంభాషణలు కూడా చక్కగా కుదిరి సినిమా ఇంపాక్ట్‌ను పెంచాయి.

నటీనటుల పనితీరు విషయానికి వస్తే, మధ్యవయస్కుడైన జస్టిన్ పాత్రలో నివిన్ పౌలీ ఒదిగిపోయారు. తనలోని సంఘర్షణను ఆయన ఎంతో సహజంగా పండించారు. ఇక మమితా బైజుతో ఆయన కాంబినేషన్ సీన్స్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా మారింది. ఇలాంటి పాత్రలు చేయడం మమితా బైజుకు కొట్టిన పిండి; తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించారు. జస్టిన్ తమ్ముడు జోయెల్ పాత్రలో సంగీత్ ప్రతాప్ కామెడీని పీక్స్‌కు తీసుకెళ్లగా, గ్లిక్సన్ పాత్రలో రోషన్ షానవాస్ కొన్ని సన్నివేశాల్లో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చక్కగా నటించారు.

మైనస్ పాయింట్స్:

కేవలం వినోదానికే పరిమితం కాకుండా కథలో బలమైన ఎమోషన్స్ జోడించాలని చూశారు. ఆలోచన మంచిదే అయినప్పటికీ, ఆ భావోద్వేగ సన్నివేశాలు మరింత బలంగా పండాల్సింది.

సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ కూడా కొద్దిగా సాగదీసిన భావన కలుగుతుంది. సెకండాఫ్‌లోని కొన్ని అనవసర సన్నివేశాలను ఎడిటింగ్‌లో కాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత షార్ప్‌గా ఉండేది.

సాంకేతిక వర్గం:

విష్ణు విజయ్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలకు తెలుగు అనువాదం బాగుంది. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ కేరళ సహజ అందాలను తెరపై ఎంతో ఆహ్లాదకరంగా చూపించింది. ఎడిటింగ్ మొదటి భాగంలో ఉన్నంత చురుగ్గా ద్వితీయార్థంలో లేదు; మరింత పదును పెట్టాల్సింది.

దర్శకుడు గిరీష్ ఏడీ ‘ప్రేమలు’ తర్వాత మరోసారి తన మార్క్ కామెడీతో హిట్ కొట్టారు. హింస, క్రైమ్ ప్రధానంగా సాగే సినిమాల నడుమ ఇలాంటి ఆహ్లాదకరమైన రొమాంటిక్ కామెడీలు రావడం ప్రేక్షకులకు మంచి ఊరట.

తీర్పు:

ఓవరాల్‌గా చెప్పాలంటే, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఫుల్-ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చక్కని రొమాంటిక్ కామెడీ డ్రామా. నివిన్ పౌలీ, మమితా బైజుల నటన, దర్శకుడు గిరీష్ ఏడీ మార్క్ హిలేరియస్ కామెడీ సీన్స్ సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్‌లో కాస్త సాగతీతను తగ్గించి, భావోద్వేగాల తీవ్రత మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ, కుటుంబ సమేతంగా హాయిగా చూసి నవ్వుకోదగ్గ మంచి చిత్రమిది. ఈ వీకెండ్‌కు నిరభ్యంతరంగా థియేటర్‌లో చూడొచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు