విడుదల తేదీ : సెప్టెంబర్ 04, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య తదితరులు
దర్శకత్వం : నిశాంత్ దోటి
సంగీతం : శేఖర్ చంద్ర
నిర్మాత : తేజేశ్వర్ వెల్పుచర్ల
సినిమాటోగ్రఫీ : కరుణాకర్ కే,
ఎడిటింగ్ : దినేష్ పెద్ది
సంబంధిత లింక్స్ : ట్రైలర్
నిశాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం కథానాయకుడిగా, శ్వేతా లక్ష్మణ్ కథానాయికగా నటించిన సినిమా సహ. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ :
సంజు (శివ కుమార్ కాసారం) స్కూల్ స్టేజ్ నుంచే సహ (శ్వేతా లక్ష్మణ్)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్ట పడుతుంది. వీరిద్దరి నడిచిన ప్రేమ అటు కాలేజీ నుంచి పెళ్లై భార్యాభర్తలు వరకూ సాగుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సంజు జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి. మరోవైపు సహ నెల తప్పుతుంది. అనంతరం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత సంజు జీవితం ఎటు వైపు వెళ్తుంది ?, అసలు ఫోన్ లో సంజు ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకీ, సహ ఏమైంది ?, ఎందుకు సంజుతో కలిసి లేదు ?, వారిద్దరి మధ్య జరిగిన గత జీవితం ఏమిటి ?, చివరకు సంజు లైఫ్ ఎలా మారుతుంది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఓ యువకుడి జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగే ప్రేమ, జ్ఞాపకాల చుట్టూ సాగిన ఈ సినిమా.. కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకుంది. తన గత జీవితంలోని బాధల నుండి కోలుకునే క్రమంలో అతని జీవితంలో జరిగిన అనుభవాలను, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు ఆపాదించుకోవడం, ఆ తర్వాత జరిగిన మార్పులను ఈ కథలో చూపించిన విధానం కూడా బాగుంది. మొత్తానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలతో బతికే ఓ వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ?.. ఈ మధ్యలో వచ్చే ఎమోషన్స్ మరియు కొన్ని ఫ్యామిలీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి.
ఈ సినిమాలో హీరోగా నటించిన శివ కుమార్ కాసారం
ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో శివ కుమార్ కాసారం నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన శ్వేతా లక్ష్మణ్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. వ్రజన పాండ్య తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు నిశాంత్ దోటి రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా దర్శకుడు ఎమోషనల్ గా బాగానే తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ సహ కథలో ముగింపు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు నిశాంత్ దోటి విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో.. బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు.
హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది. జ్ఞాపకాలతో బతికే హీరో పాత్రకి, హీరోయిన్ పాత్రకు మధ్య సీన్స్ ను ఇంకా చాలా బాగా రాసుకోవచ్చు. కానీ, ఉన్న సీన్స్ కూడా చాలా రెగ్యులర్ గా సాగాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్లే స్లోగా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేశాడు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు నిశాంత్ దోటి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. కాకపోతే, తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ దినేష్ పెద్ది అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
తీర్పు:
‘సహ’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ క్లైమాక్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


