ఇంటర్వ్యూ : హీరోయిన్ వైష్ణవి చైతన్య – ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు..!

ఇంటర్వ్యూ : హీరోయిన్ వైష్ణవి చైతన్య – ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు..!

Published on Sep 8, 2026 6:00 PM IST

‘బేబీ’ కాంబో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైష్ణవి చిత్ర విశేషాలు పంచుకుంది.

షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన మీరు, ఒక తెలుగమ్మాయిగా స్టార్‌డమ్ చూడటం ఎలా ఉంది?

చాలా ఆనందంగా ఉంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో పాటు ఇండస్ట్రీ, ప్రేక్షకులు చూపించిన ఆదరణే నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చాయి. ఇప్పుడు మన తెలుగమ్మాయిలు సినీ రంగంలో తమదైన శైలిలో రాణిస్తున్నారు. వారిలో నేను ఒకరిగా నిలవడం నిజంగా గర్వంగా, సంతోషంగా అనిపిస్తోంది.

ఎపిక్ సినిమాలో ఆనంద్, మీరు పోషించిన పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?

ఆనంద్ చేసిన ‘ఆదిత్య’ పాత్ర చాలా కూల్‌గా, పద్ధతిగా ఉంటుంది. జీవితం నేర్పిన పాఠాల నుంచి ఆదిత్య ఏం తెలుసుకున్నాడనేదే ఈ చిత్రంలో అసలు కిక్. ఇక నా విషయానికొస్తే… నేను చేసిన ‘కడలి’ పాత్ర చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, స్పష్టమైన ఆలోచనలతో నిలబడే ఒక ఇండిపెండెంట్ అమ్మాయిగా కనిపిస్తాను.

కడలి పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందా?

మన ప్రతి ఒక్కరిలో ‘కడలి’ ఉంటుంది. కానీ కుటుంబం, సమాజం వల్ల ఆ భావాలు లోపలే ఉండిపోతాయి. ఏదేమైనా ఎవరి కోసం వారే నిలబడాలి… అందుకే ఈ పాత్ర నా మనసుకి బాగా దగ్గరైంది.

దర్శకుడు ఆదిత్య హాసన్ గురించి?

దర్శకుడు ఆదిత్యతో వర్క్ చేయడం చాలా సరదాగా అనిపించింది. జీవితాన్ని లోతుగా గమనించే ఆయన, కథలో చిన్న చిన్న విషయాలకు ఇచ్చే ప్రాముఖ్యత ‘ఎపిక్’లోని ఆదిత్య, కడలి పాత్రల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది. అంతకుముందే ’90s’ సిరీస్‌తో ఆయనకు ఫ్యాన్ అయిన నాకు, ఈ సినిమా కథ విన్నప్పుడే ఆయనొక యూనిక్ అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అనిపించింది.

నిర్మాత నాగవంశీ గారి గురించి?

సితార లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత నాగవంశీ గారు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పూర్తి స్వేచ్ఛనిస్తారు. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావడంపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెడతారు.

ఎపిక్ సినిమాలో ఉన్న స్పెషల్ ఏంటి?

మనం ఎన్నో ప్రేమకథలు చూసినా, ‘ఎపిక్’లో మాత్రం ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు యూకేలో చదువుకుంటూ కలిసి లివ్-ఇన్ లో ఉండటం, వారిద్దరి మధ్య జరిగే నైజమైన సంభాషణల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. అమ్మాయి, అబ్బాయి ప్రపంచాన్ని చూసే విధానాల్లోని తేడాలు, వారి ఆలోచనలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఎలాంటి హంగామా లేకుండా, మనసును హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది.

ఎపిక్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రావొచ్చా?

ఈ సినిమాలో లివ్-ఇన్ రిలేషన్ షిప్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి, ’90s’ సిరీస్ అంత క్లీన్ ఎంటర్‌టైనర్ కాకపోవచ్చు. కానీ, దర్శకుడు ఆదిత్య ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఇబ్బందికర సన్నివేశాలు లేకుండా చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. కాబట్టి కుటుంబంతో కలిసి ఈ సినిమాను హాయిగా చూడవచ్చు.

మీ నెక్స్ట్ చిత్రాలు?

సితార బ్యానర్‌లో నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. వీటితో పాటు తమిళంలో రెండు, హిందీలో ఒక ప్రాజెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు