’శంభో శివ శంభో’, ‘వినాయకుడు’ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య తేజ్ రచయితగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. నాగపూర్‌లోని ప్రసిద్ధ గణపతి ఆలయ విశిష్టతను వివరిస్తూ ఆయన రాసిన ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకం ఫస్ట్ లుక్‌ను సుచిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ లయన్ కిరణ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సూర్య తేజ్ మాట్లాడుతూ, తేక్డి గణపతి చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం ఆధ్యాత్మిక రచన మాత్రమే కాదని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను విజ్ఞానం, ఓర్పుతో ఎలా అధిగమించవచ్చో తెలియజేసే ఒక మార్గదర్శి అని పేర్కొన్నారు. తన కెరీర్‌కు స్ఫూర్తిగా నిలిచిన డాక్టర్ కిరణ్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
నటుడిగానే కాకుండా ‘శాక న్యోరా సొల్యూషన్స్’ సంస్థకు కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ స్కిల్ డెవలప్‌మెంట్, ఉన్నత విద్యా రంగాల్లో సేవలందిస్తున్నట్లు సూర్య తేజ్ చెప్పారు. భవిష్యత్తులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విధానాల స్ఫూర్తితో రైతులు, గ్రామీణ యువత ఆర్థిక సాధికారతకు తోడ్పడే అంశాలపై మరిన్ని పుస్తకాలు రచిస్తానని ఆయన స్పష్టం చేశారు.



