విడుదల తేదీ :జనవరి 01, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : శ్రీ నందు, యామిని భాస్కర్, నరసింహ ఎస్, ప్రియాంక రెబెకా శ్రీనివాస్ తదితరులు
దర్శకుడు : వరుణ్ రెడ్డి
నిర్మాతలు : శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి
సంగీత దర్శకుడు : స్మరణ్ సాయి
సినిమాటోగ్రాఫర్ : కె. ప్రకాశ్ రెడ్డి
ఎడిటర్ : ప్రతీక్ నూటి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
శ్రీ నందు హీరోగా నటించిన యూత్‌ఫుల్ డార్క్ కామెడీ డ్రామా ‘సైక్ సిద్ధార్థ’. ఈ చిత్రానికి హీరోగా మాత్రమే కాకుండా సహ రచయితగా, నిర్మాతగా కూడా శ్రీ నందు వ్యవహరించారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమా, చాలా సింపుల్ కథను గట్టిగా, క్విర్కీగా, కొంచెం సైకో టోన్‌లో చెప్పే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో చూద్దాం.
కథ:
సిద్ధార్థ (శ్రీ నందు) వరుస మోసాలతో కుంగి పోయి ఉంటాడు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో మంచి పేరు తెస్తానని చెప్పిన మన్సూర్ చేతిలో మోసపోతాడు. దీనికి తోడు, అతని ప్రేమికురాలు త్రిష (ప్రియాంక రెబెకా శ్రీనివాస్) కూడా అతన్ని వదిలేసి మన్సూర్ వైపు నిలబడుతుంది. వరుసగా ఎదురైన దెబ్బలతో సిద్ధార్థ పూర్తిగా డిస్టర్బ్ అయి, సమాజానికి దూరంగా ఒంటరిగా జీవించడం మొదలుపెడతాడు.
అదే సమయంలో, భర్త చేతిలో బాధపడుతున్న శ్రావ్య (యామిని భాస్కర్) తన భర్తను విడిచి అదే అపార్ట్‌మెంట్‌లో నివసించేందుకు వస్తుంది. ఒక అనుకోని సంఘటన వీరిద్దరినీ దగ్గర చేస్తుంది. అక్కడినుంచి వారి జీవితాలు మెల్లగా మారడం మొదలవుతుంది. గతం ఎలా వర్తమానంపై ప్రభావం చూపుతుంది? చివరికి వీరిద్దరి ప్రయాణం ఎటు దారి తీస్తుంది? అన్నదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
శ్రీ నందుకు ఇది పూర్తిగా తన సత్తా చూపించే పాత్ర. ఇప్పటివరకు సాఫ్ట్, ఫ్రెండ్‌లీ క్యారెక్టర్స్‌కే పరిమితమైన అతను, ఇక్కడ పూర్తిగా విరిగిపోయిన, కొంచెం పిచ్చి స్వభావం ఉన్న పాత్రలో పెద్ద రిస్క్ తీసుకున్నాడు. ఆ రిస్క్ అతని నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో అతని ఫ్రస్ట్రేషన్, మెంటల్ కన్ఫ్యూజన్ బాగా వర్క్ అయ్యాయి.
సెకండ్ హాఫ్‌లో యామిని భాస్కర్‌తో వచ్చే కాంబినేషన్ సీన్స్‌లో కొన్ని జెన్యూన్‌గా నవ్వించే మోమెంట్స్ ఉన్నాయి. కథకు కొంత రిలీఫ్ అందిస్తాయి.
సిద్ధార్థ చిన్ననాటి స్నేహితుడు రేవంత్‌గా నటించిన సింహా ఎక్కడ కనిపించినా ఎనర్జీ పెంచాడు. అతని ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, షార్ప్ డైలాగ్ పంచ్‌లు సినిమాకి మంచి టెంపో తీసుకొచ్చాయి.
డైరెక్టర్ నరేషన్ స్టైల్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. చాలా పలుచని కథను విచిత్రమైన ఐడియాస్‌తో, పాప్-అప్ టెక్స్ట్స్, ఇంట్రెస్టింగ్ సౌండ్స్, క్విర్కీ కట్స్‌తో ప్రెజెంట్ చేశాడు. కొన్ని చోట్ల ఇది కామిక్ బుక్ స్టైల్ ఫీల్ ఇస్తుంది. రెండు గంటల రన్‌టైమ్ కూడా ప్లస్ పాయింట్, బోర్ కొట్టకుండా వేగంగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ మ్యాడ్‌నెస్‌ను బాగా సపోర్ట్ చేశాయి.
మైనస్ పాయింట్స్:
సింపుల్ కథను ఫంకీగా చెప్పాలన్న ప్రయత్నం చాలా చోట్ల అతిగా మారింది. సినిమా మొత్తం అరుపులు, ఒకదానిపై ఒకటి పడే డైలాగ్స్, అడల్ట్ కంటెంట్, కస్ వర్డ్స్‌తో నిండిపోయింది. మొదట నవ్వు తెప్పించిన ఈ శైలి, క్రమంగా రొటీన్ గా మారి అలసట తెప్పిస్తుంది.
యామిని భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత కనిపించినా, ఆమె పాత్ర పేపర్‌పై బాగున్నా స్క్రీన్‌పై పూర్తిగా క్లిక్ అవ్వలేదు. డైలాగ్ డెలివరీ కొన్ని చోట్ల తేడాగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ ఆశించినంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. మన్సూర్, త్రిష వంటి పాత్రలకు సరైన డెప్త్ లేకుండా కేవలం కథను ముందుకు నడిపించే క్యారెక్టర్స్ గా మిగిలిపోయాయి.
ఫస్ట్ హాఫ్ పేస్ బాగున్నా సరైన బిల్డప్ లేదు. సెకండ్ హాఫ్ కూడా అదే రిథమ్‌లో సాగుతుంది. హీరోలో మార్పు వచ్చినా కథ ఎమోషనల్‌గా లోతుగా వెళ్లదు. సినిమా స్మూత్‌గా నడిచినా, బయటకు వచ్చాక బలమైన ఫీలింగ్ మిగలదు. రా లాంగ్వేజ్, ఇంటిమేట్ సీన్స్, అడల్ట్ కంటెంట్ కారణంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూర్తిగా కనెక్ట్ కాదు.
సాంకేతిక విభాగం:
డైరెక్టర్ తాను చేయాలనుకున్న సినిమా విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాడు. వింత కట్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో కథ చెప్పే ఐడియా కొత్తగా ఉన్నా, మరింత స్ట్రాంగ్ రైటింగ్, కంట్రోల్ ఉంటే ఫలితం ఇంకా బాగుండేది.
కె. ప్రకాష్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌కు సరిగ్గా సరిపోయింది. విజువల్స్ క్లీన్‌గా ఉన్నాయి. స్మరణ్ సాయి మ్యూజిక్ సినిమా నరేషన్‌కు మంచి ఫ్లేవర్ జోడించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథను బాగా మోయగలిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్. ప్రతీక్ నూటి ఎడిటింగ్ చాలా చోట్ల షార్ప్‌గా ఉన్నా, ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా క్రిస్ప్‌గా ఉండేది.
తీర్పు:
మొత్తానికి ‘సైక్ సిద్ధార్థ’ స్టోరీ కంటే స్టైల్ మీద ఎక్కువగా ఆధారపడిన ఒక డిఫరెంట్ అటెంప్ట్. శ్రీ నందు నిజాయితీగల ప్రయత్నం, కొన్ని ఫన్నీ మోమెంట్స్ ప్లస్‌గా నిలిచినా.. లైట్ కథ, అతిగా సాగే నరేషన్, రా కంటెంట్ సినిమాను పరిమితం చేశాయి. ప్రయోగాత్మక, ఆఫ్‌బీట్ సినిమాలు ఇష్టపడే యూత్‌కు ఇది కనెక్ట్ కావచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా చూడటం కష్టమే.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
