
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ సినిమాలను నిర్మిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత లగడపాటి శ్రీధర్. తాజాగా ఆయన నిర్మాతగా రూపొందించిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే అందమైన ప్రేమకథ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు లగడ పాటి శ్రీధర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం, తదుపరి సినిమాల విశేషాల గురించి ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రశ్న) సినీ పరిశ్రమలో పదేళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ అనుభవం ఎలా ఉంది?
స) చాలా బాగుంది. నాకైతే ఇదంతా ఓ వెకేషన్‌లా ఉంది. ఈ పదేళ్ళ ప్రయాణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశా. నేను బలంగా నమ్మిన కథలనే సినిమాలుగా తీశా. ఆ విషయంలో సంతృప్తిగా ఉన్నా.
ప్రశ్న) మీ సినిమాలన్నింటిలో మెసేజ్ అనేది ఉండేలా చూసుకుంటారు. ఎందుకని?
స) నా ప్రతి సినిమాలో ఏదైనా సోషల్ మెసేజ్ ఉండాలని బలంగా కోరుకుంటా. సినిమాల ద్వారా ఏదైనా మంచి చెప్పాలన్నది ఎప్పుడూ ఉంటుంది. సినిమా చూసి జనం చాలా విషయాలు నేర్చుకుంటారని నేను నమ్ముతా. అలాగే నా సినిమాలోని మెసేజ్‌ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూంటా.
ప్రశ్న) ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ గురించి చెప్పండి. హీరోగా సుధీర్ బాబునే ఎంచుకోవడానికి కారణం?
స) సుధీర్ బాబు నిజ జీవితంలోనూ హీరోనే! బ్యాడ్మింటన్‌లో నేషనల్ లెవల్ చాంపియన్ అయినా కూడా సినిమాయే కెరీర్ అనుకొని సినిమాల్లోకి వచ్చాడు. తన కష్టంతో, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ హీరోగా నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. కష్టపడి అమెరికాలోని ఓ కంపెనీకి సీఈఓ స్థాయికి చేరే హీరో కథలో సుధీర్ ఈజీగా ఒదిగిపోయాడు. సుధీర్ బాబు ఈ సినిమాలో మంచి నటన కనబరిచాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ టాప్ 10 హీరోల్లో ఒకరుగా నిలుస్తాడు సుధీర్.
ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?
స) హీరో హీరోయిన్ల మధ్యన ఉండే ప్రేమ ఈ సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈతరానికి బాగా కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు ఈ ప్రేమకథ నుంచి ఎంతో నేర్చుకునే అంశాలున్నాయి.
ప్రశ్న) ఈ సినిమా రిలీజ్ అనుకున్న దానికంటే చాలా లేట్ అయింది. ఎందుకని?
స) మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయాలనుకున్నాం. అయితే అప్పట్లో క్రికెట్ వరల్డ్ కప్ వచ్చింది. ఇక ఆ తర్వాత రీ రికార్డింగ్ విషయంలో ఎందుకో నాకు అసంతృప్తి అనిపించింది. మళ్ళీ కొంతకాలం దానిపై వర్క్ చేశాక ఇప్పుడిక అన్నీ చూసుకొని సరైన సమయానికి ప్రేక్షకుల ముందుకు రానున్నాం.
ప్రశ్న) హీరోయిన్ నందిత గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నందితది ఓ పవర్ఫుల్ రోల్. స్క్రీన్‌పై సుధీర్ బాబు, నందితల కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. హీరోయిన్ నందిత అమ్మ గారు ఈ సినిమా చూశాక తన కూతురికి ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు.
ప్రశ్న) మీరు ఓ వ్యాపారవేత్త. సినిమా నిర్మాణానికి, బిజినెస్‌కి ఏం తేడా గమనించారు?
స) సినిమాకు, వ్యాపారానికి సంబంధం లేదు. డబ్బులున్న వారెవ్వరైనా సినిమా తీయగలరనుకుంటే అది పొరపాటే! సినిమా తీయాలంటే ప్యాషన్ ఉండాలి, సినిమాను విపరీతంగా ప్రేమించగలగాలి. అలాగే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి పూర్తిగా బాధ్యత వహించగలగాలి. కథ, సినిమాపై పట్టుంటేనే సినిమా తీయగలం.
ప్రశ్న) పెద్ద బడ్జెట్ సినిమాలు ఎప్పుడు చేస్తారు?
స) పనిగట్టుకొని పెద్ద బడ్జెట్ సినిమాలే చేయాలని నేననుకోను. అనవసరంగా సినిమా బడ్జెట్ పెంచుతూ పేరుకు పెద్ద బడ్జెట్ సినిమా చేయడం కూడా తప్పు. నేననుకునే తరహా స్క్రిప్ట్, బలమైన ఫీల్ ఉన్న కథ వచ్చినపుడు అది పెద్ద బడ్జెట్ సినిమా అయినా చేస్తా!
ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?
స) ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నా. ఇక ఈ సినిమాతో బాలీవుడ్‌నూ మెప్పించే ప్రయత్నం చేస్తా.
ఇక అక్కడితో లగడపాటి శ్రీధర్‌తో మా ఇంటర్వ్యూ ముగిసింది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా మంచి విజయం సాధించాలని 123తెలుగు తరపున ఆల్ ది బెస్ట్.