‘దేవర’ సీక్వెల్ గురించి మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో నందమూరి అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ, నందమూరి బాలకృష్ణతో సినిమా ఖరారు చేసుకోవడంతో ‘దేవర 2’ ప్రాజెక్ట్ అగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, కొరటాల ఇతర హీరోల వైపు మొగ్గు చూపడం ఈ అనుమానాలకు మరింత బలమిచ్చాయి.
అయితే, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. ‘దేవర 2’ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఎన్టీఆర్‌కు కొరటాల శివ కథను కూడా వినిపించారని సమాచారం. ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్ల వల్ల ఆలస్యమైనప్పటికీ, ఈ క్రేజీ కాంబోలో సీక్వెల్ రావడం పక్కా అని ఇటు ఎన్టీఆర్ కాంపౌండ్ నుండి, అటు కొరటాల సన్నిహితుల నుండి స్పష్టమైన సంకేతాలు అందాయి.
మరోవైపు, బాలకృష్ణ – కొరటాల శివ సినిమాను వేగంగా పూర్తి చేసి, 2027 జనవరి నాటికి కొరటాల ఫ్రీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ‘దేవర 2’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే కానీ, దేవర రాక మాత్రం ఖాయం.
