ఇంటర్వ్యూ : మంచు మనోజ్ – సేవా భావం ఉన్నవారందరినీ ఒకే వేదికపైకి తేవడమే ‘ఐక్య’ లక్ష్యం..!

Manoj Manchu Interview On The Occasion Of His Birthday

టాలీవుడ్ స్టార్ హీరో మనోజ్ మంచు తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు మంచు మనోజ్. ఇక తన పుట్టినరోజు(మే 20) సందర్భంగా ఆయన తాజాగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. తన ఐక్య ట్రస్ట్, సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన పంచుకున్నాడు.

‘ఐక్య’ ట్రస్ట్ ద్వారా మీరు ఎలాంటి సేవలు అందించబోతున్నారు?

సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి, ముఖ్యంగా అనాథ పిల్లలకు, వృద్ధులకు అవసరమైన సాయం అందించడమే మా ప్రధాన లక్ష్యం. విద్య, వైద్య రంగాల్లో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుంది. కేవలం ఒకరిద్దరికి సాయం చేసి వదిలేయడం కాకుండా, ఒక వ్యవస్థగా ఏర్పడి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలనేదే మా సంకల్పం. మా శక్తి మేరకు వీలైనంత ఎక్కువ మంది జీవితాల్లో వెలుగులు నింపడానికే ఈ ‘ఐక్య ధైర్య సేనా సమితి’ నిరంతరం శ్రమిస్తుంది.

‘ఐక్య’ ట్రస్ట్ ఎలా వర్క్ చేస్తుంది? నియమాలు ఏంటి?

‘ఐక్య’ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో ఇలాంటి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించిన విధివిధానాలు, నియమ నిబంధనలను రూపొందించే పనిలో ఉన్నాం. ఇక ట్రస్ట్ ద్వారా చేపట్టే సేవా కార్యక్రమాలకు కావాల్సిన నిధుల కోసం.. త్వరలోనే ప్రత్యేకంగా ఒక ‘ఫండ్ రైజింగ్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం.

మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది? కథల ఎంపికలో పూర్తి నిర్ణయం మీదేనా?

నాకు సినిమాల్లో మళ్లీ పునర్జన్మను ఇచ్చిన దర్శకులు విజయ్ కనకమేడల గారికి, కార్తీక్ ఘట్టమనేని గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రస్తుతం నటుడిగా అన్ని రకాల పాత్రలను చేయాలనేదే నా కోరిక. ఇక కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రతీ కథను నేనే స్వయంగా విని, నిర్ణయం తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా నా వ్యక్తిగత అభిరుచికి నచ్చిన కథలనే ఓకే చేస్తున్నాను. నా వృత్తిపరమైన జీవితంలోకి నా భార్య కానీ, ఆమె ప్రొఫెషనల్ లైఫ్‌లోకి నేను కానీ అస్సలు జోక్యం చేసుకోం. ఆ విషయంలో మేమిద్దరం ఒకరి నిర్ణయాలను ఒకరం గౌరవించుకుంటాం.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు?

మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అని ఏముంది. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తారు.

‘డేవిడ్ రెడ్డి’ విశేషాలు ఏంటి?

ఈ సినిమా గురించి నేనేదో చెప్పడం కంటే, రేపు (మే 20) సాయంత్రం విడుదల కాబోతున్న గ్లింప్స్ చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. మాటల కంటే మన పని మాట్లాడితేనే బాగుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది. నిర్మాత హనుమా రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘వాట్ ది ఫిష్’ పరిస్థితి ఏంటి?

కొన్ని అనుకోని కారణాల వల్ల ‘వాట్ ది ఫిష్’ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి వాయిదా పడింది. నేను, సత్య, వెన్నెల కిషోర్ కలిసి చేయాల్సిన ఈ సినిమాకు చివరి నిమిషంలో చాలా మందికి వీసా సమస్యలు వచ్చాయి. స్క్రిప్ట్ చాలా బాగుంది, కానీ సినిమా పట్టాలెక్కడానికి అన్ని పరిస్థితులు కలిసి రావాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి.

‘మోహన రాగ మ్యూజిక్’ పనులు ఎక్కడి వరకు వచ్చాయి?

‘మోహన రాగ మ్యూజిక్’ అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వస్తోంది. ఎంతో ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, గాయకులు ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పాటల రికార్డింగ్ పూర్తయింది. మరో నాలుగు పాటలు సిద్ధం కావాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తిగా పూర్తి కావడానికి ఇంకో రెండు, మూడు నెలల సమయం పట్టేలా ఉంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెప్పండి?

ప్రస్తుతం నా చేతిలో ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు ఈ నెలలోనే ఒక్కొక్కటిగా రాబోతున్నాయి. ప్రతీ హీరో నుంచి ప్రేక్షకులకు నిరంతరం సినిమాలు రావాలని నేను బలంగా కోరుకుంటాను. అందుకే నేను కూడా గ్యాప్ లేకుండా వరుసపెట్టి చిత్రాలు చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నాను. ప్రస్తుతం చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో చాలా బిజీగా గడుపుతున్నాను.

Exit mobile version