‘బాహుబలి’తో.. శక్తిమంతమైన బ్రాండ్‌గా రానా..!

rana
‘బాహుబలి’ అనే సినిమాకు ఎలాగైతే ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదో, రానా దగ్గుభాటి అనే వ్యక్తిక్తీ ఎలాంటి పరిచయమూ అక్కర్లేదు. ఆరడుగులకు పైనే పొడవు, అందుకు తగ్గట్టుగానే కండపుష్టి కలిగిన హీరోల్లో రానా మొదటి స్థానంలో ఉంటారు. తన ఫిజిక్, యాక్టింగ్‌తో ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తూ దేశమంతటికీ పరిచయస్థుడైపోయారు రానా. ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’లో రానా విలన్‌గా నటించిన తర్వాత అతడి పరిధి, స్థాయి అమాంతం పెరిగిపోయాయి.

తెలుగు సినీ పరిశ్రమలో పలు అద్భుతమైన సినిమాలను నిర్మించి తనకు తానుగా ‘రామా నాయుడు’ అనే బ్రాండ్‌ను సొంతం చేసుకున్న సినీ దిగ్గజం కుటుంబంలో మూడో తరం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు రానా. తెలుగు సినిమా హీరో అంటే ఇలాగే ఉండాలనుకునే కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలూ, ఆలోచనలు ఉన్న నేపథ్యం నుంచి వచ్చి కూడా ‘లీడర్’ లాంటి ఓ డిఫరెంట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం రానాకే చెల్లింది. ఆ తర్వాత కూడా అన్నింటికీ అనుకూలమైన సేఫ్ సైడ్ సినిమాలతో కాకుండా తాను చేయగల, తన ప్రతిభను భయటపెట్టగల సినిమాలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోయారు. ఈ ప్రయోగం, ప్రయత్నమే రానాను బాలీవుడ్‍, కోలీవుడ్‌లకు పరిచయం చేయడమే కాక ఇండియాలోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ‘బాహుబలి’లో విలన్‌గా నటించే అవకాశం తెచ్చిపెట్టింది.

‘బాహుబలి’ సినిమాలో బలమైన భల్లాలదేవ అనే విలన్ పాత్రకు రానా ఎంపికయ్యాడనే వార్త వెలువడిన రోజు నుంచే రానాపై అందరూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇలా ఒక్కొక్కటీ విడుదలవుతూ వచ్చాయో ఆ పాత్ర గురించి ఇంకా పూర్తి అవగాహనేదీ రాకముందే రానా తప్ప ఈ పాత్రను మరొకరు చేయలేరేమో అనే అభిప్రాయాన్ని కల్పించారు. దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, సూపర్ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకునేందుకు ‘బాహుబలి’, రానాకు ఓ బలమైన శక్తిగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున ‘బాహుబలి’ విడుదల కానుంది. ఆ రోజున రానా ఎలాగూ తానేంటో, తన నటనా స్థాయి ఏంటో చూపించి తీరతారు. ఇప్పటికైతే ఆరోజు (బాహుబలి రోజు) కోసం ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న చూపులతో చూడడమే!

Exit mobile version