
‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో కామెడీ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం, మూడో సినిమా ‘భాయ్’ పరాజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ రోజే తన కొత్త సినిమాను మొదలుపెట్టారు. లవర్ బాయ్ ఆది హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఉదయం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయి కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
గత కొంతకాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ప్రస్తుతం ‘గరమ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! గరమ్ పూర్తైన వెంటనే వీరభద్రం సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం. మంచి కామెడీ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా తనకు ఓ కొత్త గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆది నమ్మకంగా ఉన్నారట. ఈ సినిమాకు వీరభద్రం తన స్టైల్లో చుట్టాలబ్బాయి అంటూ మంచి టైటిల్ పెట్టి సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఇక చుట్టాలబ్బాయిగా ఆది చేసే సందడి సినిమాకే హైలైట్ అవుతుందని సినిమా యూనిట్ చెబుతోంది.

