
బ్లాక్ బస్టర్ హిట్ ‘జులాయి’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి ఇదివరకే తెలియజేశాం. అలాగే చాలా రోజుల నుంచి సెట్స్ పైకి వెళ్ళని ఈ సినిమా సెప్టెంబర్ చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలియజేశాం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు భామలు హీరోయిన్స్ గా ఆడిపాడనున్నారు. అందులో ఇప్పటికే సమంత ఎంపికైంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఆద శర్మ నటించనుంది. ఆద శర్మ అల్లు అర్జున్ సరసన నటించే చాన్స్ కొట్టేయడంతో ఖుషీ ఖుషీగా ఉండడమే కాకుండా బన్నిని తెగ పొగిడేస్తోంది. ‘అల్లు అర్జున్ సినిమాలో చాన్స్ అనగానే థ్రిల్ అయ్యాను. నేను బన్నికి పెద్ద అభిమానిని. బన్ని చాలా స్టైలిష్ మరియు సూపర్బ్ డాన్సర్. జులాయి చూసినప్పటి నుంచి ఎప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తానా అని వెయిట్ చేస్తున్నానని, ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందని’ తెలిపారు.
అల్లు అర్జున్ కి గట్టి పోటీని ఇచ్చే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’ సినిమాని మనకు అందించిన కె. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.