లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా టీజర్, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ అహల్యా బమ్రూ విలేకరుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకుంది.
సింగీతం శ్రీనివాసరావు గారితో పని చేయడం ఎలా అనిపించింది?
సింగీతం శ్రీనివాసరావు గారు అద్భుతమైన దర్శకుడు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. ఆయన దర్శకత్వంలో పని చేయడం నా అదృష్టం. ఆయన గత చిత్రాలాగే ‘సింగ్ గీతం’ కూడా కాలానికి ముందున్న సినిమా. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని సరికొత్త కాన్సెప్ట్ ఇది. 94 ఏళ్ల వయసులో కూడా ఇంత మోడ్రన్ ఆలోచనతో సినిమా చేయడం ఆయనకే సాధ్యం.
ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
సింగీతం గారి సినిమాల్లో మహిళా పాత్రలు చాలా బలంగా, స్వతంత్రంగా ఉంటాయి. ఇందులో నా పాత్ర కూడా సాధారణ హీరోయిన్లా కాకుండా, చాలా కొత్తగా, బలమైన వ్యక్తిత్వంతో ఉంటుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రను కూడా ఒక అమ్మాయే చేయడం ఒక అరుదైన విషయం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ఈ కథ యూనివర్సల్‌గా కనెక్ట్ అవుతుంది.
దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం గురించి?
దేవిశ్రీ ప్రసాద్ గారు జీనియస్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఈ చిత్రానికి చాలా బ్యూటిఫుల్ మరియు ప్రత్యేకమైన సంగీతాన్ని అందించారు. పాటలు చాలా యూనిక్‌గా ఉంటాయి. ఇప్పటికే విడుదలైన ‘ఏమైంది ఏమైంది’, ‘హలో బాసు’ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతో అలరించాయి.
నాగ్ అశ్విన్ గారి సపోర్ట్ గురించి?
నాగ్ అశ్విన్ గారు సింగీతం గారికి పెద్ద అభిమాని. ఆయన ఈ సినిమా క్రియేటివ్ ప్రాసెస్‌లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ప్రతి నటుడితో మాట్లాడి విలువైన సూచనలు ఇచ్చేవారు. దర్శకత్వం మొత్తం సింగీతం గారిదే అయినప్పటికీ, సినిమా మరింత బాగా రావడానికి అవసరమైన ప్రతిదాన్ని నాగ్ అశ్విన్ గారే దగ్గరుండి చూసుకున్నారు.
నిర్మాతల గురించి?
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లలో పని చేయడం నా అదృష్టం. నిర్మాతలు ప్రియాంక గారు, స్వప్న గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ.. ఎప్పుడూ కొత్త తరహా కథలను ప్రేక్షకులకు అందించాలని ఆలోచిస్తారు. వారితో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.
