సమీక్ష :- ‘కాగితం పడవలు’ – రొటీన్ గా సాగే సిల్లీ లవ్ డ్రామా !

విడుదల తేదీ : సెప్టెంబర్ 18, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : వర్ధన్ గుర్రాల, కృష్ణ ప్రియా, సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్ రాజులపాటి తదితరులు
దర్శకత్వం : ఎంజీఆర్ తుకారాం
నిర్మాతలు : కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప
సంగీతం : AIS.నౌఫల్ రాజా
ఛాయాగ్రహణం : ఎంజీఆర్ తుకారాం
కూర్పు : జెస్విన్ ప్రభు

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో వచ్చిన ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

రామ్ (వర్ధన్ గుర్రాల) – గోదావరి (కృష్ణప్రియా) ఇద్దరూ చిన్నతనం నుంచి ఒకర్ని ఒకరు ఇష్టపడతారు. ఐతే, చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా రామ్ ను, గోదావరి దూరం పెడుతుంది. కానీ, రామ్ మాత్రం ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు. కానీ, వీరి ఊర్లు మాత్రమే కాదు, వీరి కులాలు కూడా వేరు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీరి స్నేహితులైన రాజేష్, స్వప్న ప్రేమ కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. వారి చావు, వీరిద్దరిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది ?, వీరి పరిస్థితి కూడా రాజేష్, స్వప్నల మాదిరి తయారవుతుందా ?, పెద్దలకు వీరి ప్రేమ విషయం తెలిశాక ఎలాంటి గొడవలు జరిగాయి ?, చివరకు వీరి జీవితాలు ఏమయ్యాయి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

పరువు హత్యల బ్యాక్ డ్రాప్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ఆ ప్రేమ కథల్లోని తీవ్రత మాత్రం ఎప్పుడూ ఫ్రెష్ గానే ఉంటుంది. ఈ కథలో కూడా పరువు హత్యల నేపథ్యంలో మంచి పాయింట్ ఉంది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమను దక్కించుకోవడానికి హీరో పాత్ర చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ఈ మధ్యలో ప్రేమికుల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఫ్యామిలీ సీన్స్.. ఇవ్వన్నీ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.

ఈ సినిమాలో హీరోగా నటించిన వర్ధన్ గుర్రాల ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో వర్ధన్ గుర్రాల నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన కృష్ణ ప్రియా నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం బాగుంది. సమ్మెట గాంధీతో పాటు ప్రేమ్ సాగర్ రాజులపాటి కూడా తమ పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘కాగితం పడవలు’ కథలో హీరో హీరోయిన్ల చైల్డ్ ట్రాక్ మైనస్ అయింది. స్టార్టింగ్ సీక్వెన్స్ ల్లో నటించిన నటీనటుల నటన కూడా సిల్లీగా అనిపిస్తోంది. అసలు ఈ ఎపిసోడ్ లేకపోయినా ప్రేమకథలో సంఘర్షణను ఎస్టాబ్లిష్ చెయ్యొచ్చు. కానీ, దర్శకుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూను పూర్తిగా వదిలేశాడు. దీనికితోడు ఫస్ట్ హాఫ్‌లో బ్యాక్ టు బ్యాక్ వచ్చే సాంగ్స్ కూడా ఎక్కువ అయిపోయాయి.

సీన్స్ లో మ్యాటర్ లేకపోవడం వల్లే సాంగ్స్ పెట్టారేమో అని ఫీలింగ్ వస్తోంది. ఈ ‘కాగితం పడవలు’ కథలో ముగింపు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు ఎంజీఆర్ తుకారాం విఫలం అయ్యాడు.

అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో.. బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు. అలాగే, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది. అన్నట్టు, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ఎంజీఆర్ తుకారాం దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. కాకపోతే, తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. సంగీత దర్శకుడు AIS.నౌఫల్ రాజా అందించిన సంగీతం బాగుంది. ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

‘కాగితం పడవలు’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ ఓకే అనిపించినా.. కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని లాజిక్ లెస్ అండ్ సిల్లీ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, ఏ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Exit mobile version