దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ ఇచ్చినా రెండో సినిమాను సెట్ చేసుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. మధ్యలో నాగ చైతన్య లాంటి హీరోల కోసం ట్రై చేసినా సెట్ కాలేదు. చివరకు ‘మహా సముద్రం’ కోసం శర్వానంద్ ను ఎంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజగా మొదలైంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అసాధారణమైన పాత్రలతో కూడిన ఉద్రేకభరితమైన లవ్ స్టోరీని, ఇంటెన్స్ డ్రామాను మీకు చూపించడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇలాంటిదాన్నీ ఇంతకుముందెప్పుడూ మీరు అనుభవించి ఉండరు. ఖచ్చితంగా దీన్ని మీరు ప్రేమిస్తారు అంటూ చెప్పుకొచ్చారు అజయ్ భూపతి.
అజయ్ భూపతి మాటలు వింటుంటే సినిమా కథ, అందులోని పాత్రలపై ఆసక్తి క్రియేట్ అవుతోంది. మొదటి సినిమాలో హీరోయిన్ పాత్రతో చేసినట్టే అజయ్ ఇందులో కూడ థ్రిల్లింగ్ మ్యాజిక్ ఏదైనా చేస్తారేమో అనిపిస్తోంది. ఈ చిత్రంలో శర్వాతో పాటు సిద్దార్థ్ కూడ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో అదితిరావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
