ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ రాజ్ తాజాగా ‘శనార్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నందికి చెందిన ‘సంపత్ నంది టీమ్‌వర్క్స్’ మరియు కె.వి. శ్రీధర్ రెడ్డికి చెందిన ‘శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రతిష్టాత్మక ‘ఆదిత్య మూవీస్’ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సంపత్ నంది శిష్యుడు రాజ్ గణేష్ ఉప్పునూటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ పల్లెటూరి నేపథ్య చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల కలబోతగా రూపొందుతున్న ఈ చిత్రం నుండి తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
‘శనార్తి’ టైటిల్‌కు తగినట్లుగానే, పసుపు, ఎరుపు రంగులు, గాజులు మరియు కంకణాలతో కూడిన రెండు చేతులు జోడించి ఉన్న విజువల్స్ తెలంగాణ మట్టి వాసనను ప్రతిబింబిస్తున్నాయి. ఈ సినిమాలో తెలంగాణ జానపద పాటలతో మంచి ప్రజాదరణ పొందిన నాగదుర్గ హీరోయిన్గా నటిస్తోంది. ఓదెల ఫ్రాంచైజ్ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన సంపత్ నంది మద్దతు ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే మంచి అంచనాలు నెలకొన్నాయి.
