కన్నడ నటుడు భార్గవ్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రం “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బండి నాగరాజు ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తుండగా, మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కె. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు దశరథ్ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు వీరశంకర్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్ అందజేశారు.
గ్రామీణ నేపథ్యంతో కూడిన ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాదంబరి కిరణ్, కిల్లి క్రాంతి, టేస్టీ తేజ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తుండగా, సాయి కృష్ణ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ మొదటి వారం నుంచి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూళ్లలో చిత్రీకరణను పూర్తి చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులలో షూటింగ్ జరిపి, అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తామని చిత్రబృందం పేర్కొంది.
