
అక్కినేని నాగేశ్వరరావు.. ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండే ఒక పేరు. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధిపతిగా సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించిన ఆయన, ఏన్‌ఆర్‌గా ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే ఉంటారు. ఇక ఏఎన్‌ఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన తరువాతి రెండో తరం, మూడో తరం నుంచి అక్కినేని వంశం నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. తాజాగా ఈ కోవలో అక్కినేని అఖిల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. అఖిల్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు.
అక్కినేని వంశం మూడో తరం నుంచి అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమాపై ఉండే అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఇక ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఏఎన్‌ఆర్ జయంతి సందర్భంగా నేడు హైద్రాబాద్‌లో పెద్ద ఎత్తున జరగనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇక తన మొదటి సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో అఖిల్, తన ఆనందాన్ని పంచుకుంటూ ఏఎన్‌ఆర్‌ను తల్చుకున్నారు.
“నా మొదటి సినిమా విడుదలకు సిద్ధమవుతోందంటే ఎంతో ఎగ్జైటింగ్‌గా, సంతోషంగా ఉంది. అయితే నేను హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఈ టైమ్‌లో తాతగారు ఇక్కడ లేకపోవడం మాత్రం బాధిస్తోంది. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే బాగుండుననిపిస్తోంది. ఏది ఏమైనా ఆయన ఓ నిండు జీవితాన్ని అనుభవించారు. ఆ విషయంలో మేమంతా సంతృప్తిగా ఉన్నాం. ఇక ఆయన ఇప్పుడు ఇక్కడ లేకున్నా ఆశీస్సులు మాత్రం ఎప్పుడూ ఉన్నాయనే అనిపిస్తూంటుంది” అంటూ అఖిల్, ఏఎన్‌ఆర్‌ను గుర్తు తెచ్చుకున్నారు. ఇక హీరో నితిన్ నిర్మాతగా రూపొందించిన అఖిల్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల కానుంది.