
పక్కా మాస్ మసాలా సినిమాల స్పెషలిస్ట్ అయిన బోయపాటి శ్రీను మొదటి సారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘సరైనోడు’ అనే టైటిల్ ని కూడా దాదాపుగా ఖరారు చేసారు. ఆగష్టు 31న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుందని ఇదివరకే తెలియజేశాం. ఒక 5 రోజులు గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం నిన్నటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను అల్లు అర్జున్ పై రౌడీలను చితకబాదే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిత్యం రద్దీగా ఉండే పాతబస్తీలోని ఓ మార్కెట్ స్ట్రీట్ సెట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలోని నార్త్ సిటీలో వేసారు. అక్కడే అల్లు అర్జున్ పై రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు.
ఈ యాక్షన్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో పాటు శ్రీకాంత్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ రోజు కూడా అక్కడే యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు. ఆగష్టు 10వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరగనుంది. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఉంటూనే తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండేలా వినోదం, కుటుంబ విలువలను మిక్స్ చేసి బోయపాటి ఈ సినిమా కథని సిద్దం చేసారు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

