తెలుగు హీరోలు తెరపైనే కాక నిజ జీవితంలోనూ హీరోలుగా నిలిచే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. తమ అభిమానుల కోరికలను తీర్చడానికి గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి తారలు తమను చూడాలనుకునే వారిని కలిసి వారితో కొంతసేపు గడిపి వారికి సంతోషాన్ని కల్పించిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయారు.
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులు అల్లు అర్జున్‌ను కలవాలనే తమ కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ముందు ఉంచారు. క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న ఆ చిన్నారులను కలిసి వాళ్ళకు ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ మేక్ ఏ విష్ సంస్థ అడిగిన దానికి వెంటనే ఓకే చెప్పేశారు. ఈ ఉదయం 11 గంటలకు బన్నీ తనను కలవాలని కోరిన చిన్నారులతో కలిసి కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. వారి కోసం తాను స్వయంగా తీసుకొచ్చిన కొన్ని బహుమతులను కూడా అందజేశారు.
ఇక ఈ సందర్భంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. మేక్ ఏ విష్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమానికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం కుదుటపడాలని, వారంతా చక్కగా కోలుకోవాలని కాంక్షించారు. ఆసుపత్రి వర్గాలతో చిన్నారుల చికిత్స గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరచమని బన్నీ ఈ సందర్భంగా కోరారు.
