
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తనదైన మ్యానరిజమ్, యాక్టింగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న బన్నీ ఫ్యాన్స్ ఎక్కువగా యూత్ ఆడియన్సే! ఇక ఈ ఫ్యాన్స్‌కు బన్నీ కూడా మొదట్నుంచీ మంచి గౌరవం ఇస్తూ వాళ్ళతో సరదాగా ముచ్చటిస్తూ వాళ్ళకు మరింత దగ్గరయ్యారు. తాజాగా బన్నీకి తన ఫ్యాన్స్‌పై ఉన్న గౌరవం ఎంతటిదో మరోసారి ఋజువు అయింది.
దసరా పండుగను ఈ ఏడాది తన అత్తగారింట్లో జరుపుకునేందుకు బన్నీ నల్లగొండ జిల్లాలోని చింతపల్లి గ్రామానికి విచ్చేశారు. బన్నీ వచ్చాడన్న విషయం తెలుసుకొని ఆ గ్రామంలోని యూత్ మాత్రమే కాకుండా పక్క గ్రామాల నుండి కూడా భారీ ఎత్తున యూత్ బన్నీని చూడడానికి బారులు తీరారు. బన్నీ వాళ్ళందరితో సరదాగా మాట్లాడి, రెండు డైలాగులు చెప్పి, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తుండగా అభిమానులంతా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు.
ఇక ఈ సందర్భంగానే కొందరు అభిమానులు అత్యుత్సాహంతో బన్నీకి దగ్గరగా రాగా, వారిపక్కనే ఉన్న ఓ వ్యక్తి అభిమానులను పక్కకు నెట్టేశాడు. ఇక తన అభిమానులు పక్కకు తోశాడన్న కారణంతో అల్లు అర్జున్, ఆ వ్యక్తిపై సీరియస్ అయ్యారు. “కుర్రోళ్ళ మీద చెయ్యి వేస్తున్నావెందుకు? కుర్రోళ్ళ మీద చెయ్యేస్తే బాగోదు చెప్తున్నా!” అంటూ బన్నీ స్వయంగా ఆ వ్యక్తిపై సీరియస్ అవుతూ మాట్లాడటంతో మళ్ళీ అభిమానులంతా ఓ సూపర్ అంటూ కేరింతలు కొట్టారు.