తెలుగు సినిమాల్లో హీరోకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో సినిమా వస్తోందంటే చాలు.. వారం, పది రోజుల ముందునుంచే అభిమానుల హడావుడి మొదలవుతుంది. అదేవిధంగా తాము ఎంతగానో అభిమానించే హీరోలకు బిరుదులు కూడా ఇచ్చి ఆ పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అంటూ ఎన్టీఆర్ కాలం నాటినుంచే మొదలైన ఈ ట్రెండ్ సూపర్ స్టార్, మెగా స్టార్, పవర్ స్టార్.. ఇలా రకరకాల బిరుదులతో నేటికీ కొనసాగుతూనే ఉంది.
కాగా మెగాస్టార్ అనే బిరుదుకంటే ముందు అభిమానులంతా చిరంజీవిని ‘సుప్రీమ్ హీరో’ అంటూ పిలుచుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి మెగాస్టార్‌గా అవతరించాక సుప్రీమ్ హీరో అనే బిరుదు వేరే ఇతర స్టార్స్ ఎవ్వరికీ వెళ్ళలేదు. ఈ క్రమంలో తెలుగు సినిమాకు ఇప్పటివరకూ సుప్రీమ్ హీరో అంటే చిరంజీవి మాత్రమే! అయితే తాజాగా మెగా ఫ్యామిలీ నుంచే కొత్తగా ఎంట్రీ ఇచ్చి మెప్పిస్తోన్న హీరో సాయిధరమ్ తేజ్ సుప్రీమ్ హీరో అనే బిరుదును సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తాజాగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంటూ మెప్పించేందుకు థియేటర్లలో వాలిపోయారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల మేనరిజమ్స్‌తో సాయిధరమ్ తేజ్ మెగా అభిమానులకు బాగా దగ్గరయ్యారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ద్వారా సాయిధరమ్ తేజ్ కెరీర్లో మరో హిట్ వచ్చి చేరినట్లేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లో హరీష్ శంకర్, సాయిధరమ్ తేజ్‌కి ‘సుప్రీమ్ హీరో’ అనే ట్యాగ్ తగిలించడం విశేషంగా కనిపిస్తోంది. తన మ్యానరిజమ్స్‌తో మెగా ఫ్యామిలీ బడా హీరోలను గుర్తు చేస్తోన్న సాయి, ఈ బిరుదుకి సరిగ్గా సరిపోతారని అభిమాన సంఘాలు కూడా సుప్రీమ్ హీరో టైటిల్‌ను ఓకే చేసేశాయి. ఇక ఇప్పటివరకూ తెలుగు సినిమాకు సుప్రీమ్ హీరో అంటే ఒక్క చిరంజీవియే కనపడగా, ఇకపై సాయిధరమ్ తేజ్ కూడా లెక్కలోకి రానుండడం విశేషం!
