టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు వరుసగా ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ‘దోస్త్(వర్కింగ్ టైటిల్)’. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – తమిళ యంగ్ హీరో కార్తీ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్టర్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో శరవేగంగా జరుగుతుంది. మరో 10 రోజులు అక్కడే షూటింగ్ చేయనున్నారు. మొన్నటిదాకా ఒక్క తమన్నానే హీరోయిన్ అనుకున్న ఈ సినిమాలో ఓ మెయిన్ రోల్ కోసం సౌత్ ఆఫ్రికన్ మోడల్ గాబ్రియేల్ల దిమెత్రియాడెస్ ని ఎన్నిక చేసారు.
ఎన్నిక చేయడమే కాకుండా నాగార్జున – గాబ్రియేల్లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హాట్ బ్యూటీ అనుష్క ఓ ముఖ్య పాత్రలో కనిపించి థ్రిల్ చేయనుందని అంటున్నారు. అనుష్క ఎక్కువ సేపు కనిపించకపోయినా అలా వచ్చి, సినిమాలో ఓ చిన్న ట్విస్ట్ తెచ్చి వెళ్ళిపోతుందని సమాచారం. త్వరలోనే తనపై వచ్చే సీన్స్ షూట్ చేయనున్నారని సమాచారం. ఈ లండన్ షెడ్యూల్ తో 80% సినిమా షూటింగ్ పూర్తవుతుంది. పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.
