ఫోటో మూమెంట్ : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో అధికారులతో సమీక్షా సమావేశంలో ఉన్న సమయంలో ఆయన అస్వస్థతకు గురవడంతో వైద్యులు ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో పవన్ క్రమంగా కోలుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో, శనివారం సాయంత్రం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ పవన్‌ను కలిసి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అనా లెజ్నెవా కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ అభిమాన నాయకుడిని క్షేమంగా చూడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరో పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో, పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజులు ఇంటికే పరిమితం కానున్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత ఆయన తిరిగి తన పాలనాపరమైన విధుల్లో పాల్గొంటారు.

Exit mobile version