
మలయాళ కుట్టి అయిన అసిన్ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అనతి కాలంలోనే వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకొని సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. అదే టైంలో అమీర్ ఖాన్ చేసిన ‘గజినీ’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సౌత్ సినిమాలను తగ్గించిన అసిన్ బాలీవుడ్ లో బిజీ అయ్యింది. అక్కడ వరుసగా ఆఫర్స్ దక్కించుకోవడమే కాకుండా నాలుగు 100 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అసిన్ గత రెండు సంవత్సరాలుగా మైక్రోమాక్స్ ఫౌండర్ అయిన రాహుల్ శర్మతో ప్రేమాయణం సాగిస్తోందని, అతనినే పెళ్లి చేసుకోనుందని ఇది వరకే తెలిపాము.
చెప్పినట్టు గానే రాహుల్ శర్మ – అసిన్ ల ఎంగేజ్ మెంట్ ఆగష్టులో జరిగింది. తాజాగా వీరి పెళ్ళికి ముహూర్తం మరియు వెన్యూని ఫిక్స్ చేసారు. రాహుల్ శర్మ అసిన్ లు నవంబర్ 26వ తేదీన పెళ్లి చేసుకోనున్నారు. న్యూ ఢిల్లీ లోని ఓ 7 స్టార్ హోటల్ లో జరగనున్న ఈ పెళ్ళికి సినిమా, రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అలాగే నవంబర్ 27వ తేదీన వెస్ట్ ఎండ్ గ్రీన్ ఫాంహౌస్ లో ఈ నూతన దంపతులు తమ సన్నిహితులను ఆహ్వానించి రిసెప్షన్ చేసుకోనున్నారు. కావున మరో నెల రోజుల్లో ఈ మలయాళ కుట్టి పెళ్ళి పీటలు ఎక్కనుంది.