డిసెంబర్ రిలీజ్‌కు ఫిక్స్ అయిన ‘ఎటాక్’!

Atack

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో ఎటాక్ పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. క్రైమ్ జానర్లో పలు విజయవంతమైన సినిమాలను తీసిన వర్మ, మళ్ళీ అదే జానర్లో చేస్తోన్న ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్స్ సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు.

కాగా నవంబర్ నెలలో ఈ సినిమా విడుదలవుతుందనే ప్రకటనను ఇంతకుముందే ఎటాక్ టీమ్ వెల్లడించినా, ఆ తర్వాత మళ్ళీ సినిమా ప్రస్తావన ఎక్కడా కనబడలేదు. అయితే తాజాగా హీరో మనోజ్ ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘ఎటాక్’ సినిమాతో వర్మ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఓ సరైన హిట్ తప్పక వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా వర్మ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్‌ను మోసుకొస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో గతంలో వచ్చిన సర్కార్ సినిమా తరహా కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

Exit mobile version