
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా గత నెలలో విడుదలై ఇప్పటికీ సంచలనాలు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఈ విజువల్ వండర్, పలు అంతర్జాతీయ పత్రికల ప్రశంసలను సైతం చూరగొంది. ఇక తెలుగు సినిమా స్టార్స్ సైతం ‘బాహుబలి’ని ప్రశంసల్లో ముంచెత్తడం గత నెల రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆ జాబితాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా చేరిపోయారు.
రవితేజ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘కిక్ 2’ ఈ శుక్రవారమే విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిక్ 2 గురించి విశేషాలు తెలియజేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రవితేజ, తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి ప్రస్తావన తెచ్చారు. బాహుబలి సినిమా ఇండియన్ మార్కెట్ రేంజ్ ఏంటనేది నిరూపించిందని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు మనకూ సాధ్యమని నిరూపించిన ఈ సినిమాతో తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చాయని రవితేజ అభిప్రాయపడ్డారు. ఇక బాహుబలి, తెలుగు సినిమాకు ఓ మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.