యూఎస్ బాక్సాఫీస్ : 2015 టాప్ 100లో ‘బాహుబలి’!

యూఎస్ బాక్సాఫీస్ : 2015 టాప్ 100లో ‘బాహుబలి’!

Published on Sep 9, 2015 5:00 PM IST

baahu-bali
‘బాహుబలి’.. తెలుగు సినిమా స్థాయిని ఇటు మార్కెట్ పరంగా, అటు టెక్నికల్ అంశాల పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా భాషేదైనా ‘బాహుబలి’ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఇక అమెరికాలో ఒక ప్రాంతీయ సినిమా ఊహకు కూడా అందని కలెక్షన్స్ సాధించి ‘బాహుబలి’, ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.

అమెరికాలో ‘బాహుబలి’ సినిమా సాధించిన కలెక్షన్స్‌ చూసి హాలీవుడ్ పత్రికలు సైతం ఆశ్చర్యపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ అమెరికాలో విడుదలైన అన్ని సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తే ‘బాహుబలి’ సినిమా, 91వ స్థానంలో నిలబడి సత్తా చాటింది. 6.7 మిలియన్ డాలర్లతో బాహుబలి ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ లిస్ట్‌లో జురాసిక్ వరల్డ్ టాప్ పొజిషన్‌లో నిలిచింది.

ఒక తెలుగు సినిమా అమెరికన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో వందల హాలీవుడ్, ఇతర భాషల సినిమాల మధ్యన ఒక సినిమాగా విడుదలై టాప్ 100లో చోటు దక్కించుకోవడమంటే ప్రత్యేక విశేషమనే చెప్పాలి. ఈ సినిమాతో ప్రభాస్, రానాలు నేషనల్ వైడ్ స్టార్స్ అయిపోయారు. ఇక బాహుబలికి పార్ట్ 2గా రానున్న ‘బాహుబలి ది కంక్లూజన్’ వచ్చే ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే. మరి ఆ సినిమా ఇంకెన్ని విశేషాలను నమోదు చేస్తుందో అన్నది ఇప్పటికే ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు