ప్రధాని మోడీని కలిసిన ప్రభాస్..!

Prabhas-meets-PM-Narendra-M

‘బాహుబలి’ మానియా ఒక్క సినీ పరిశ్రమనే కాక రాజకీయ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులను సైతం అబ్బురపరచి సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే! దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా రెండు వారాల క్రితం విడుదలై తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళింది. ఇక ఈ నేపథ్యంలోనే ‘బాహుబలి’ సినిమా కథానాయకుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తమ సినిమాను వీక్షించవలసిందిగా కోరారు.

కాగా తాను బిజీగా ఉన్న కారణంగా ‘బాహుబలి’ సినిమాను ఇంకా చూడలేకపోయానని, త్వరలోనే సమయం కుదుర్చుకొని చూస్తానని ప్రభాస్‌తో నరేంద్ర మోడీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రభాస్, మోడీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. ఇక ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన సినిమా చేసినందుకు గాను మోడీ, ప్రభాస్‌ను ఈ సందర్భంగా అభినందించారని సమాచారం. ప్రధాని మోదీని రెబెల్ స్టార్ కృష్ణం రాజుతో కలిసి ప్రభాస్ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కలిశారు.

ఇదిలా ఉంటే.. నిన్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానిలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి ప్రభాస్ బాహుబలి సినిమా వీక్షించమని కోరిన విషయం తెలిసిందే!

Exit mobile version